Home  »  Featured Articles  »  ఎస్వీఆర్, భానుమతిలతో కళాతపస్వి సినిమా చెయ్య‌లేదు.. ఎందుకో తెలుసా?

Updated : Jul 6, 2026

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు, సంగీత సాహిత్యాలకు పెద్ద పీట వేసిన అద్భుత దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్. 'ఆత్మగౌరవం' చిత్రంతో దర్శకుడిగా ప్రస్థానం ప్రారంభించి, తెలుగు సినిమా గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనది. అయితే దర్శకుడిగా మారకముందు ఆయన కెరీర్ వాహినీ స్టూడియోలో ఒక సాధారణ సౌండ్ రికార్డిస్ట్‌గా ప్రారంభమైంది. ఆ సమయంలో వాహినీ స్టూడియోలో ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి వంటి ఎందరో మహామహులతో ఆయనకు ఎంతో ఆత్మీయమైన సాన్నిహిత్యం ఏర్పడింది. తరువాతి కాలంలో ఆయన దర్శకుడిగా మారిన తర్వాత వీరిలో చాలా మందితో అద్భుతమైన క్లాసిక్స్ తెరకెక్కించారు. కానీ చిత్రమేమిటంటే, టాలీవుడ్ చరిత్రలోనే తిరుగులేని నటులుగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి గార్లతో కె.విశ్వనాథ్ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఎంతో స్నేహం, గౌరవం ఉన్నప్పటికీ వీరి కాంబినేషన్‌లో సినిమా రాకపోవడానికి వెనుక కొన్ని ఆసక్తికరమైన కారణాలు, విశ్వనాథ్ వ్యక్తిగత నిర్ణయాలు ఉన్నాయి.

కె.విశ్వనాథ్ సౌండ్ రికార్డింగ్ విభాగంలో చేరిన తొలినాళ్లలోనే ఎస్వీ రంగారావు కూడా పరిశ్రమలోకి ప్రవేశించారు. ఎస్వీఆర్‌కి నటుడిగా బ్రేక్ ఇచ్చిన 'షావుకారు' సినిమా షూటింగ్ మొత్తం వాహినీ స్టూడియోలోనే జరిగింది. ఆ చిత్రంలో ఆయన సున్నం రంగడిగా చేసిన నటనను విశ్వనాథ్ చాలా దగ్గర నుండి గమనించారు. ఆ తర్వాత 'పాతాళభైరవి' చిత్రానికి విశ్వనాథ్ అసిస్టెంట్ సౌండ్ రికార్డిస్ట్‌గా పని చేయగా, బి.ఎన్. రెడ్డి  'బంగారు పాప' చిత్రానికి కూడా పని చేశారు. అన్నపూర్ణ సంస్థ నిర్మించిన 'తోడికోడళ్ళు', 'మాంగల్యబలం' వంటి సినిమాల్లో ఎస్వీఆర్‌తో కలిసి పని చేసే అవకాశం విశ్వనాథ్‌కు దక్కింది. సాధారణంగా సెట్స్‌లో నటీనటులు ఎవరైనా డైలాగులు వేగంగా చెబుతూ స్పష్టత తప్పితే, రికార్డిస్ట్‌గా విశ్వనాథ్ వారి దగ్గరకు వెళ్లి చెప్పేవారు. వారు రీటేక్ తీసుకునేవారు. కానీ ఎస్వీఆర్ డైలాగ్ డెలివరీ చాలా విలక్షణమైనది. ఆయన ఎంత వేగంగా మాట్లాడినా, ఆ మాటల్లోని విరుపులు, స్పష్టత అద్భుతంగా ఉండేవి. అందుకే సెట్‌లో ఎస్వీఆర్‌ని ఒక్క రీటేక్ కూడా అడగాల్సిన అవసరం రికార్డిస్ట్‌గా విశ్వనాథ్‌కు ఎప్పుడూ రాలేదు. అంతటి పరస్పర గౌరవం, సాన్నిహిత్యం వీరి మధ్య ఉండేది.

అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావాలని పరిశ్రమలో కొందరు నిర్మాతలు ఒక‌టి రెండు సార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. దీనికి ప్రధాన కారణం నటీనటుల టెంపర్మెంట్స్ గురించి విశ్వనాథ్‌కి ఉన్న స్పష్టమైన అవగాహన. ఎస్వీ రంగారావు, భానుమతి ఇద్దరూ కూడా ప్రత్యేక కేటగిరీకి చెందిన నటులు. అభినయంలో తమదైన పంథా కలిగిన నిష్ణాతులు. సహజంగానే అటువంటి గొప్ప నటుల టెంపర్మెంట్స్‌లో కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి. ముఖ్యంగా భానుమతికి ఇతరులను డామినేట్ చేసే ఒక ప్రత్యేకమైన గుణం ఉండేది. అందువల్లనే ఆమెతో కలిసి వర్క్ చేయడానికి విశ్వనాథ్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఎస్వీఆర్, భానుమతిల‌తో ఉన్న ఆత్మీయమైన స్నేహం, అనుబంధం జీవితాంతం ఇలాగే అందంగా కొనసాగాలంటే, వారితో ఎలాంటి వృత్తిపరమైన లావాదేవీలు లేదా సినిమాలు పెట్టుకోకూడదని విశ్వనాథ్ ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నారు. వృత్తి వల్ల స్నేహం పాడవకూడదనే ఈ సున్నితమైన ఆలోచనా విధానం వల్లే, ఒక దర్శకుడిగా విశ్వనాథ్ ఆ ఇద్దరు లెజెండ్రీ నటీనటులకు ఎప్పుడూ యాక్షన్ చెప్పలేకపోయారు.

 

 

 

K Viswanath, SV Ranga Rao, Bhanumathi, Tollywood Flashback, Vahini Studios, K Viswanath Movies






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.